📍 Locations
F T W

ముత్తగూడెంలో దారుణం..!

Category: Breaking News | 03 Nov 2025

ముత్తగూడెంలో దారుణం..!

కలహాలే ప్రాణాలు తీసాయి – తల్లి మృతి, కుమారుడు సతమతం

నిందితులు రూరల్‌ పోలీసులకు లొంగుబాటు

 

ఖమ్మం రూరల్‌, నవంబర్‌ 3 (మన వెలుగు ప్రతినిధి):

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెం గ్రామంలో ఆదివారం ఘోర హత్య చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.వివరాల్లోకి వెళ్తే — ముత్తగూడెంకు చెందిన మొటపోతుల వెంకన్న కుమార్తె అఖిలను అదే గ్రామానికి చెందిన గునిగంటి మహేశ్‌కు మూడు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో ఇటీవల విడాకులు తీసుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అఖిల తండ్రి వెంకన్న, కుమారుడు మనోజ్‌, బావమరిది మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం దేవునిసంకీస గ్రామానికి చెందిన యల్టి వెంకన్నతో కలిసి ఆదివారం మహేశ్‌ ఇంటికి వెళ్లారు. “మా అమ్మాయిని తిరిగి భార్యగా అంగీకరించు” అని అడగగా మహేశ్‌ నిరాకరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.తర్వాత ఆగ్రహానికి గురైన వెంకన్న, మనోజ్‌, యల్టి వెంకన్నలు కర్రలు, కత్తులతో మహేశ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో మహేశ్‌ కడుపు, వెన్ను భాగాల్లో తీవ్రంగా గాయపడ్డాడు. కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించిన మహేశ్‌ తల్లి నాగమణి (50)పై కూడా కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

తీవ్ర గాయాలపాలైన మహేశ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హత్య చేసిన ముగ్గురు నిందితులు — మొటపోతుల వెంకన్న, మనోజ్‌, యల్టి వెంకన్న — రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.