📍 Locations
F T W

భూ వివాదం బారిన రైతు బలి..?గూడూరుపాడు లో ఉద్రిక్త పరిస్థితి

Category: Breaking News | 09 Apr 2026

*భూ వివాదం బారిన రైతు బలి? గూడూరుపాడులో ఉద్రిక్త పరిస్థితి*

 

ఖమ్మం రూరల్, మన వెలుగు ప్రతినిధి:-

 

ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామంలో భూ వివాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుని గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం గూడూరుపాడు గ్రామానికి చెందిన బండి రామయ్య (52) అనే రైతు గత కొంతకాలంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆయన తన సొంత వ్యవసాయ భూమిని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ గ్రానైట్ వ్యాపారికి విక్రయించినట్లు సమాచారం.

అయితే భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి క్వారీకి వెళ్లే దారిని మరింత వెడల్పు చేయాలని రామయ్యపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఈ విషయమై ఇరువురి మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.

ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి లోనైన రామయ్య గురువారం తెల్లవారుజామున క్వారీ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న భారీ వాహనానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

అయితే రామయ్య ఆత్మహత్యకు అసలు కారణం భూ వివాదాలేనా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు.

ఈ ఘటనతో గూడూరుపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.