📍 Locations
F T W

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విశాంక్ ఆర్యన్ 464 మార్కులతో కాలేజ్ టాపర్‌గా కిరీటం, డబుల్ సెలబ్రేషన్

Category: Breaking News | 12 Apr 2026

మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడకు చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థి చింతం విశాంక్ ఆర్యన్ తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి కాలేజ్ టాపర్‌గా నిలిచి సత్తా చాటాడు.

విశాంక్ ఆర్యన్ తల్లిదండ్రులు చింతం స్వప్న, స్థానిక విజయక్రాంతి రిపోర్టర్ చింతం భాస్కర్ దంపతుల పెద్ద కుమారుడు. చిన్నప్పటి నుంచే చదువులోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ అద్భుత ప్రతిభ కనబరిచిన విశాంక్, తన కృషి, క్రమశిక్షణతో ఈ విజయాన్ని సాధించాడు.

కాప్రా పరిధిలోని కాల్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన అతడు, ప్రస్తుతం కర్మన్ ఘాట్ ప్రాంతంలోని గురు శిక్షణ జూనియర్ కాలేజీలో చదువుతున్నాడు. కాలేజ్ యాజమాన్యం, ఉపాధ్యాయులు అతని ప్రతిభను కొనియాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహిస్తాడని అభినందించారు.

ఇంటర్ ఫలితాల్లో అగ్రస్థానం సాధించడంతో పాటు, ఇదే రోజు అతని జన్మదినం కావడం విశేషం. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యం, స్నేహితులు, బంధువులు కలిసి అతనికి అభినందనలు తెలుపుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

దమ్మాయిగూడలో వ్యాపారం నిర్వహిస్తున్న అతని తల్లిదండ్రులు కుమారుడి విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.